Wednesday, July 2, 2008

అదృశ్య దృశ్యాలన్నీ....

అదృశ్య దృశ్యాలన్నీ....

ఒక్కొక్క ప్పుడు బండ రాయిలా
మారిపోతున్నపుడు
నిన్న పాడిన కోయిల పాట లా
నువు పుడతావు...
ఆకారమే లేని నువు అవతారమై
అణువణువునా
అల్లుకుపోయి
నీ అమృత ధారల్లో ముంచేస్తావు..
ఇంతలోనే ముక్క ముక్కలుగా
నేల రాలి పోతావు,
ఎక్కడో మూలాల్లో వేళ్ళు
చిగుర్లు తొడుక్కుంటాయి
అప్ర యత్నంగానే
కాళ్ళు భారంగా
మోసుకుంటూ ఇక్కడ పడేస్తాయి..
ముడుచుకున్న పొరలు
ఒకటొకటిగా విచ్చుకుంటూ
ఇదిగో ఇక్కడే
పురి విప్పిన నెమళ్ళు లా
అనుభవాల వింజామరలు
మబ్బుల్ని మోసుకొచ్చి
చిరుజల్లు ల్ని చిలకరిస్తాయి..
రాలిన నందివ ర్ధనం పూలలా
గడప ముందే జారిపడిన
జ్ఞాపకాల్ని ఏరుకుంటూంటే
ఎంత కాలమయింది నేస్తమా
దుప్పట్లో దగ్గర చేర్చుకున్నంత వెచ్చగా
ఇల్లంతా ఒక్కసారే
నన్ను చుట్టేస్తుంది...
గదులు వస్తువుల్ని
ఎక్కడివక్కడే సర్దు కుంటాయి
కేలండ ర్లని మింగిన మేకు
గోడమీద నిద్రపోతూంటుంది
మోగి మోగి మూగబోయిన
కాలింగ్ బెల్ ..
నాయింటికి నేనే అతిధి నయ్యానని
నవ్వుకుంటుంది..
అమ్మ పాడిన ' బాబా' పాట
గదంతా ఏరులై పారుతూంటుంది!
పూజగదిలో అగరుబత్తి వాసన
ఘుప్పున కౌగిలించు కుంటుంది !
తిరిగి తిరిగొచ్చి కొడుక్కి
ప్రేమని వడ్డించిన తల్లిలా
వంట గది...
అంతేనా...
గదులన్నీ నోళ్ళు తెరుచుకుని
బావురుమంటూ
ఒకటొకటిగా నాముందు వాలి పోతూంటాయి !
ఎవరి కేమయినా... నాకు మాత్రం
స్మృతి ఒక వరం
వి స్మృతి ఒక శాపం.