Tuesday, October 28, 2008

ఊరికి నీరంటి...
నాగరికత నాలుకలకి,
కాలుష్యం కోరలకీ దూరంగా
ప్రకృతి ఒడిలోనే..బడి..గుడి..
అనాగరికులమైనా ఆప్యాయతలకీ
అభిమానాలకీ అడ్డుగోడలు ల్లేవు.
ఈ నేల మాది, నింగి మాది
ఎల్లలెరుగని స్వాతంత్ర్యం
అడవి తల్లి బిడ్డ లం..
ఇదంతా నిన్న !!

మరి నేడో..
మీ ఆకలికి, దాహానికి
మా సంస్కృతి, జీవితాలు పణంగా
గిరిపుత్రుల గుండెల్లో ప్రభుత్వ ' సునామీ'
ఊరికి నీరంటి...
గంగ మింగేస్తున్న వనాలూ, వాసాలూ!
వనాల్లో కోయిలలు
కాకుల్తో ఏకం కాలేక
మాకొద్దీ ప్రాజెక్టులు, ప్రవాసాలు
నిరసనలు, నిట్టూర్పులు..
' అయినా నీతో గొంతు కలిపేదెవరని?'

నింగికెగిరిన మా సహనం
కొండ కోయిలల గర్జనలతో
వాడివేడి విల్లంబులతో
అడవంతా ' అల్లూరిలే'
అయితే మాత్రం..
మీరేమయినా తెల్లదొరలా కాల్చడానికి ?
మాటల మూటలు చేతిలో పెట్టి
వరాల సరాలు మెడలో వేసి
మా పొదరిళ్ళని పకడ్బందీగా
కూలగొట్టే అధికారిక కబ్జాదారులు!
గిరిజన చట్టాల్తో మాకంటే
లబ్ది పొందింది మీరు కాదు ?

అడవితో అల్లుకుపోయిన
జీవితాలు ఛిద్రమై
ఆశల మూటలు భుజానికెత్తుకుని
చెట్టుకొకరు పుట్టకొకరై
చిరునామాల్లేని మృతజీవులం

ఇహ రేపో ?
మామీద మరీ జాలిపడి పోయినోళ్ళు
మా వ్యధల్నీ, పోరాటాల్నీ..కధలల్లి..
ఓ పది సినిమాల సొమ్ము చేసుకుంటారు !
మా సంస్కృతీ, సౌరభాల్ని కాపాడే వారసులుగా
నృత్య నాటికలు, వీధి నాటికలు
ప్రదర్శనలిచ్చేస్తుంటారు...

ఎవరో ప్రేక్షకుల మధ్యలో
బుట్ట చేత పట్టుకున్న వాడి
కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర
గతస్మృతుల్ని దిగమింగుతూ..
బరువెక్కిన స్వరంతో..
పల్లీలండీ...పల్లీలండీ... అంటూ
జనం లో కల్సిపోతాడు...!

(ఉత్తరాంధ్ర కవితల పోటీలలో ఉత్తమ కవితగా ' తూరుపు ' అనే కవితాసంకలనంలో ప్రచురింపబడిన కవిత)

Monday, October 27, 2008

అయినా.....






అయినా మళ్ళీ నిద్ర వద్దు
నిన్నటి కల ఇంకా పచ్చిగానే ఉంది
నాటకానికి తెరపడే సరికి
ఎక్కడో మొదలయిన గాలి దుమారం
మేఘాల్ని మోసుకొచ్చి
కళ్ళల్లో నింపుతుంది
గాలికి రెప రెపలాడుతూ
కిటికీలు మూత పడిపోతాయి
ఎపుడో వాడిపోయిన
జ్నాపకాల పూల మీద
రంగునీళ్ళు చల్లి
సీతాకోకచిలుకల్ని బుట్టల్తో
మోసుకొస్తుంది కల
తీరని కోరికల తీరాల్ని
చేరుస్తుంది కల
వేయి ప్రశ్నల
సమాధానం కల
చీకట్లని ముంచిన
వెలుగు వెల్లువ కల
సహశ్ర వేదనల
లేపనం కల
నిన్నటి నిద్ర నన్ను
నిర్వీ ర్యుణ్ణి చేసి వెళ్ళిపోయింది
నిన్నటి కల ఇంకా పచ్చిగానే ఉంది
అయినా మళ్ళీ నిద్ర వద్దు...