Friday, November 14, 2008

ఓ పిచ్చివాడు

అతడు నాకు రోజూ కనిపిస్తాడు
చిరిగిన చొక్కాలో,చిరునవ్వులో
నాచూపులు కాగడాలై
గాయాలు వెతుకుంటాయి
అతని చిరు దరహాసపు తేజస్సులో
నేను గుడ్డి వాణ్ణయిపోతాను
నామాటలు వేయి వీణలవాణియై
అతణ్ణి స్పృశిస్తూ వుంటాయి
అతని మౌనం లో
నేను మూగవాణ్ణయి పోతాను : అతడు :
నేనోరోజు అతనికి
డబ్బులివ్వబోయాను
ఎవరి కోసమో అన్నట్లు
దూరంగా వెళ్ళిపోయాడు
మరో రోజు అతనికి
ఆహారం ఇవ్వబోయాను
కుళ్ళిన వ్యర్ధాలు తింటూకనిపించాడు
అనిర్వచనీయ బంధం
నన్ను కట్టికుదిపేస్తుంది
ఏమైన రేపు మాట్లాడించాలి..
నిద్ర నిండా పరుచుకున్న చీకట్లో
హ్రుదయం మీద పరిచిన తివాచీపై
ఆకశమంత ఎత్తులో,అనంత తేజస్సులో
తెల్లని దుస్తుల్లో, అదే చిరునవ్వుతో
అతడు నాకు కనిపిస్తున్నాడు
నేనేదో వేడుకుంటున్నాను
అతడేడేదో చెపుతున్నాడు
నాకేమీ వినబడడం లేదు
ఆయినా ఏదో అర్ధమవుతూన్నట్లేవుంది..
అతడు నాకు ఈ రోజు కని పించాడు
చుట్టూచేరిన చూపుల కాన్వాసు మధ్య
తాటాకు మీద భగవద్గీత శ్లోకం లా
ఎవరో అంటున్నారు..
పాపం పిచ్చివాడు చని పోయాడని
నాకేమీ వినబడడం లేదు.....
ఎవరా పిచ్చివాడు ?


4 comments:

ఏకాంతపు దిలీప్ said...

మనలో నిస్సహాయుడు?

ఏకాంతపు దిలీప్ said...

ప్రసాద్ గారు, ఈ మధ్య రాయలేదు??

శ్రుతి said...

అమ్మ చెప్తుండేది, మంచి హృదయం ఉన్న వాళ్ళు ఏ చిన్న సంఘటనకో మనసు చెదిరి అలా అయిఉండవచ్చు లేదా ఎక్కువ మేధస్సు ఉన్న వాళ్ళే పిచ్చి వాళ్ళవుతారట. నిజానికి వాళ్ళు కాదు వాళ్ళలా కావడానికి కారణ మనమే పిచ్చి వాళ్ళం అని. నిజమేనేమో మరి.
ఏదేమైనా మీరు చెప్పిన తీరు ఆలోచింప చేసింది.

నేస్తం said...

baagundi andi :)