ఊరికి నీరంటి...
నాగరికత నాలుకలకి,
కాలుష్యం కోరలకీ దూరంగా
ప్రకృతి ఒడిలోనే..బడి..గుడి..
అనాగరికులమైనా ఆప్యాయతలకీ
అభిమానాలకీ అడ్డుగోడలు ల్లేవు.
ఈ నేల మాది, నింగి మాది
ఎల్లలెరుగని స్వాతంత్ర్యం
అడవి తల్లి బిడ్డ లం..
ఇదంతా నిన్న !!
మరి నేడో..
మీ ఆకలికి, దాహానికి
మా సంస్కృతి, జీవితాలు పణంగా
గిరిపుత్రుల గుండెల్లో ప్రభుత్వ ' సునామీ'
ఊరికి నీరంటి...
గంగ మింగేస్తున్న వనాలూ, వాసాలూ!
వనాల్లో కోయిలలు
కాకుల్తో ఏకం కాలేక
మాకొద్దీ ప్రాజెక్టులు, ప్రవాసాలు
నిరసనలు, నిట్టూర్పులు..
' అయినా నీతో గొంతు కలిపేదెవరని?'
నింగికెగిరిన మా సహనం
కొండ కోయిలల గర్జనలతో
వాడివేడి విల్లంబులతో
అడవంతా ' అల్లూరిలే'
అయితే మాత్రం..
మీరేమయినా తెల్లదొరలా కాల్చడానికి ?
మాటల మూటలు చేతిలో పెట్టి
వరాల సరాలు మెడలో వేసి
మా పొదరిళ్ళని పకడ్బందీగా
కూలగొట్టే అధికారిక కబ్జాదారులు!
గిరిజన చట్టాల్తో మాకంటే
లబ్ది పొందింది మీరు కాదు ?
అడవితో అల్లుకుపోయిన
జీవితాలు ఛిద్రమై
ఆశల మూటలు భుజానికెత్తుకుని
చెట్టుకొకరు పుట్టకొకరై
చిరునామాల్లేని మృతజీవులం
ఇహ రేపో ?
మామీద మరీ జాలిపడి పోయినోళ్ళు
మా వ్యధల్నీ, పోరాటాల్నీ..కధలల్లి..
ఓ పది సినిమాల సొమ్ము చేసుకుంటారు !
మా సంస్కృతీ, సౌరభాల్ని కాపాడే వారసులుగా
నృత్య నాటికలు, వీధి నాటికలు
ప్రదర్శనలిచ్చేస్తుంటారు...
ఎవరో ప్రేక్షకుల మధ్యలో
బుట్ట చేత పట్టుకున్న వాడి
కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర
గతస్మృతుల్ని దిగమింగుతూ..
బరువెక్కిన స్వరంతో..
పల్లీలండీ...పల్లీలండీ... అంటూ
జనం లో కల్సిపోతాడు...!
(ఉత్తరాంధ్ర కవితల పోటీలలో ఉత్తమ కవితగా ' తూరుపు ' అనే కవితాసంకలనంలో ప్రచురింపబడిన కవిత)
Tuesday, October 28, 2008
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
నిర్వాసితులైన గిరిజనులపై చాలా శక్తివంతంగా భూత,వర్తమాన,భవిష్యత్ కాలాలను అక్షరీకరించారు. నిజమే నగర జీవన కల్లోలాలు, గిరిపుత్రులను కూడా కబళించే దిశగానే మనప్రయాణం సాగుతుంది.
nee bonda
@ప్రసాదు గారు
మీ కవిత గిరిజనుల పరిస్థితిని సంపూర్ణంగా చిత్రీకరించింది... చాలా బాగుంది.. రెపొచ్చే పోలవరం తో ఎన్ని కొండలు మునిగిపోతాయో, ఎందరి పరంపర మరుగునపడిపోతుందో... నేనెప్పుడు ఇలాంటి విషయాల మీద రాయగలుగుతానో...
anaanimas gaaru
koMcheM vaLLu daggara pettukoni maatlaadaMdi.
iMkO anaanimas
చాల శక్తివంతమైన కవిత్వం రాసారండి..
Post a Comment